Friday 24 February 2012

వాస్తుపై వాదోపవాదాలు

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు... 17
వాస్తువాది గౌరు తిరుపతిరెడ్డి తన 'గౌరువాస్తు' అనే మాసపత్రిక ఆగస్టు 2005 సంచికలో ఇలా సవాల్‌ విసిరారు.
''మేము వాస్తుకు విరుద్ధంగా ఒక ప్లాన్‌ ఇస్తాం. ఈ ప్లాన్‌ ప్రకారం హైదరాబాద్‌ నుండి ప్రొద్దుటూరుకు వెళ్ళే మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా 20కి.మీ. దూరంలోపు గ్రామాలలో మాత్రమే ఇంటిని నిర్మించాలి. ఇలాంటి ఇంట్లో ఐదేళ్లు కాపురం ఉండాలి. ఈ ఐదేళ్లలో ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగల్గితే గౌరువాస్తు ప్రకటిస్తున్న రెండు లక్షల రూపాయలు ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తీసుకోవచ్చు. అలా జీవించలేకపోతే వారు డిపాజిట్‌ చేసిన రెండు లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. ''ఆ ప్లానులో ఆయన సూచించిన వాస్తుదోషాలేమిటంటే (1) పశ్చిమ నైరుతిలో గేటు (2) నైరుతిలో నుయ్యి (3) దక్షిణ-పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ ఉంచడం. ఈ మూడు దోషాలు మరణాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని వాస్తుదోషాలుగా పేర్కొనబడిన ఇంటిని సూచించారు. వాటి కారణంగా పురుషుల జీవితాలకు ఘోరకలి అనీ, సుదతుల సుఖాలను నలగదంచుతుందనీ, అంతులేని అరిష్టాలొస్తాయనీ అస్పష్ట ఫలితాలు సూచించారు. దానికి నేనిచ్చిన సమాధానాన్ని, దానికి గౌరుగారి సమాధానాన్ని 'గౌరువాస్తు' అక్టోబరు 5లో ప్రచురించారు. నేను నా సమాధానంలో ఇలా పేర్కొన్నాను.

''మీ సవాల్‌లో మీరు సూచించిన వాస్తుదోషం ఉన్న ఇంట్లో ఐదు సంవత్సరాలు 'ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగలిగితే'' రెండులక్షల రూపాయలు ఇస్తామన్నారు. వాస్తును సైన్సుగా మీరు పరిగణిస్తున్నారు. కాబట్టి, మీ సవాలు మరింత శాస్త్రబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ వాస్తు దోషం కారణంగా ఏకాలంలో ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాని 'ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా' అని అస్పష్టంగా ప్రకటిస్తే ఎలా? ఐదు సంవత్సరాలపాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయా? దానిని కూడ మీరు మీ ఒడిదుడుకుల జాబితాలో చేర్చవచ్చుగదా? అందువలన, వాస్తు దుష్ఫలితాలను స్పష్టంగా ప్రకటించండి. అంతేకాదు. 'వాస్తుదోషం' ఉన్న ఇళ్ళవాళ్లు పట్టణాల నుండి, నగరాల నుండి మీ వద్దకు వందల సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి నివారణా పద్ధతులు చెప్పకుండా మా జనవిజ్ఞాన వేదిక సభ్యులకు కనీసపు అద్దెకీయమనండి. పైన నేను పేర్కొన్నట్లు 'ఆ ఇళ్ళలోని వాస్తు దుష్ఫలితాన్ని' మీరు స్పష్టంగా పేర్కొనండి. మీ సవాలును ఎదుర్కొనడానికి మా కార్యకర్తలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని హైదరాబాద్‌-ప్రొద్దుటూరు మెయిన్‌రోడ్డుకు 20 కి.మీ. దూరంగా ఉండే గ్రామంలో ఏ ఉద్యోగస్థుడైనా, వ్యవసాయదారుడైనా ఐదు సంవత్సరాలు ఎలా ఉండగలడు? ఏం పెట్టుకొని తినగలడు? కాబట్టి మీరు మరింత వాస్తవిక దృక్పథంతో విషయాన్ని పరిశీలించి సవాలును విసిరితే, ఆ సవాలును స్వీకరించడానికి జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.''
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో వచ్చే వారం ఇదే శీర్షికలో చదవండి...
- కె.ఎల్‌.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  

ప్రతి సంవత్సరం ఈ నెల 28న 'జాతీయ సైన్స్‌ దినోత్సవం' జరుగుతుంది. నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ కనిపెట్టిన రామన్‌ ఎఫెక్ట్‌కు గుర్తింపుగా ఈరోజున జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరపాలని 1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున రామన్‌ తన విశిష్ట 'రామన్‌ ఎఫెక్ట్‌'ను కనుగొన్నారు. ''కొత్త విషయాలను కనిపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రజ్ఞులకు ఈరోజున దేశం కృతజ్ఞతలతో, గౌరవాభివందనలను తెలుపుతుంది. ఈ రోజున జరిగే విద్యాకార్యక్రమాలు బాలల్ని 'విజ్ఞానశాస్త్రం' వైపు ఆకర్షించి, వృత్తిగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. శాస్త్రజ్ఞులందరూ నాణ్యమైన పరిశోధనలతో దేశాభివృద్ధికి పునరంకితం కావడానికి, వీరి పరిశోధనలతో దేశం గర్వపడడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. ''దేశప్రగతికి, జాతి పురోభివృద్ధికి శాస్త్రవిజ్ఞానం అత్యవసరమని ఈ రోజు ఉత్సవాలు దేశప్రజలకు సందేశాన్నిస్తాయి'' అని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ సూచించారు.

విజ్ఞానశాస్త్ర ఫలాలు ముఖ్యంగా నూతన సాంకేతికాల రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ, ముఖ్యంగా అణగారిన వర్గాలకూ, పేదలకూ అందాలని మన విజ్ఞాన వీచిక కోరుకుంటుంది. అలానే జనవిజ్ఞాన వేదిక లాంటి ఇతర సంస్థలూ కోరుకుంటున్నాయి. అయితే ఇప్పటి ప్రపంచీకరణలో అదనపు సౌకర్యాల పేరుతో ఆధునిక సాంకేతికాల ద్వారా బహుళజాతి కంపెనీలు మన దేశ వనరులను ప్రజలను, శ్రామికులను దోచుకుంటూ మన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలపై పట్టును సాధించుకుంటున్నాయి. ఒకవైపు ఈ సాంకేతికాలు అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నట్లు కనిపిస్తున్పప్పటికీ, అవి కలిగించబోయే నష్టాలను వెంటనే అంచనాకు రాలేకపోతున్నాం. ఉదాహరణకు.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో నాణ్యమైన తాగునీటి లభ్యత ఒక సమస్యగా ఉంది. దీనివల్ల అనేకమందికి జబ్బులు వస్తున్నాయి.

ఎంతోమంది అంటురోగాల బారిన కూడా పడుతున్నారు. వెంటనే వైద్యం అందనివారు చనిపోతున్నారు కూడా. వీరికి నాణ్యమైన, సురక్షితమైన నీటి సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. దీనికోసం క్లోరినేషన్‌ చేసి వడపోసి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇది చౌకైనది కూడా. ప్రత్యామ్నాయంగా కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని అలవాటు చేయిస్తే కూడా సమస్య పరిష్కారమవుతుంది. ఇది అన్నికాలాల్లో సురక్షితమైన, విశ్వసనీయమైన పద్ధతి కూడా. దీనికి బదులుగా ప్రభుత్వం ఏం చెపుతుందంటే.. ఈ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడానికి 20లీటర్ల మినరల్‌వాటర్‌ను రెండు రూపాయలకే సరఫరా చేస్తానని చెప్తుంది. ఒక పథకాన్ని కూడా రూపొందించింది. దీని అసలు ఉద్దేశం సురక్షితమైన నీటిని సరఫరా చేసే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కాకుండా ప్రకృతి వనరైన నీటిని అమ్మి కొనే వస్తువుగా మార్చడం. తద్వారా కార్పొరేట్‌ రంగాలకు ప్రకృతివనరులను కట్టబెట్టి, వారికి శాశ్వత లాభాలను సమకూర్చిపెట్టడం. ఇటువంటి కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలను, దీనిలో ఉన్నటువంటి సాంకేతికాలను ప్రజలకు వివరిస్తూ సైన్స్‌ దినోత్సవ సందర్భంలో ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గమనంలో ఉంచుకొని విజ్ఞానవీచిక వరుసగా గత రెండు వారాలు (11,18 తేదీల్లో)గా సాంకేతిక విజ్ఞానం మంచిచెడ్డలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంలో మినరల్‌ వాటర్‌ గురించీ ఈ శీర్షిక కిందే రెండుసార్లు (మే, 14, జులై 31) వివరాలు ఇచ్చాం. ఈ విజ్ఞానం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా అందరిలోకి వెళ్లాలని విజ్ఞానవీచిక కోరుకుంటుంది.

గత ఐదేళ్లులో చేసిన కృషి ఆధారంగా విజ్ఞానశాస్త్రాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసిన వ్యక్తికి లేదా సంస్థకు, ప్రచార మాద్యమానికి (పేపరు, రేడియో, టీవీ, చిత్రాలు), బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన వారికి వేరువేరుగా ఈ సందర్భంలో జాతీయ పురస్కారాలు ఇస్తారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వైపు బాలల్ని ఆకర్షించేందుకు ఈ రోజున వివిధ పరిశోధనా సంస్థలు బాలల్ని ఆహ్వానించి తమ పరిశోధనల్ని చూపెడతాయి. సైన్స్‌ ప్రదర్శనలు, పోటీలు, ఇతర కార్యక్రమాలు బాలల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంపై అవగాహనను పెంచుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శాస్త్రీయ దృక్పథం విస్తరిస్తున్నమేర ఈ ఉత్సవాల లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.
ముగింపు
విజ్ఞానశాస్త్రం విస్తరిస్తున్నకొలదీ, అదనపు సాంకేతికాలు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉపయోగించుకున్న మేర అదనపు సౌకర్యాలను, అవకాశాలను కలిగించవచ్చు. కానీ, ఏ కొత్త సాంకేతికాన్నైనా వినియోగించుకునే ముందు దాని మంచి, చెడ్డలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం ప్రచార సమాచారం మీద ఆధారపడకుండా, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త సాంకేతికాలను ఆహ్వానించి, నిత్యజీవితంలో ఇముడ్చుకోవాలి. దీనికి బదులుగా కేవలం కంపెనీల ప్రచారం మీద ఆధారపడి, నిర్ణయం తీసుకుంటే, పలు సందర్భాలలో విలువైన వనరులను, కాలాన్ని నష్టపోవాల్సి రావచ్చు. లేదా కంపెనీల మీద, ఇతర సంస్థల మీద ఆధారపడాల్సి రావచ్చు. తద్వారా అదనపు ఖర్చుల, స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కోల్పోవాల్సి రావచ్చు. ముఖ్యంగా, కొత్తకొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఆహారపదార్థాలు, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రపంచీకరణ కాలంలో నష్టపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందువల్ల నిత్య జీవితంలో కొత్తగా ఇముడ్చుకునే సాంకేతికాలు అంతిమంగా భారం కాకూడదని అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిరమిడ్స్‌ ఎలా నిర్మించారు? అందుకు ఉపయోగించిన రసాయన పదార్థం ఏమిటి?

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 10 Mar 2010, IST  


భారీ యంత్రాలు, టెక్నాలజీ లేని కాలంలో ఈజిప్టు పిరమిడ్స్‌ను ఎలా నిర్మించారు ? పిరిమిడ్స్‌ నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంట్‌ లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం ?
- ప్రత్యూష, విజయవాడ, కృష్ణాజిల్లా.
ఈజిప్టు దేశంలో ఉన్న పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు దర్పణం పట్టిన అత్యంత ప్రాముఖ్యతగల నిర్మాణాలు. అయితే ఇవి కళలకుగానీ కళాపోషణకు గానీ సంబంధించిన కట్టడాలు కావు. దాదాపు 138 విడివిడి పిరమిడ్లను సుమారు 850 సంవత్సరాలపాటు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో నిర్మించారు. క్రీ.పూ. 2630 (క్రీ.పూ.27వ శతాబ్దం)లో మొదటి పిరమిడ్‌ను నిర్మాణం చేశారు. క్రీ.పూ. 2611 సంవత్సరం వరకు దీని నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు సుమారు 20 వేల మంది శ్రామికులు చెమటోడ్చి పనిచేయడం వల్ల ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆఖరి పిరమిడ్‌ను క్రీ.పూ.1814 సంవత్సరంలో పూర్తి చేశారని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.
కైరో నగరానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో ప్రారంభించి దాదాపు 200 కి.మీ. వరకు విస్తరించిన హవారా ప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138 పిరమిడ్లుగా గుర్తిస్తున్నారు. ఇపుడు వివిధ అవసానదశల్లో 30 వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలో ఉన్నవి కేవలం 8 మాత్రమే! ఇందులో క్రీ.పూ. 2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్‌ పిరమిడ్‌ సుమారు 150 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడాలను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవ నిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్‌ పిరమిడ్‌ అత్యంత ఎత్తయిన కట్టడం.

పిరమిడ్లు నిజానికి ఆనాటి కాలాల్లో అశాస్త్రీయ ఛాందసభావాలతో విరాజిల్లుతున్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు (pharaos) అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్‌ అనే అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్‌ పిరమిడ్‌ను క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్‌ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్‌ మాట్‌ సమాధిగా హవారాలో క్రీ.పూ.1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తి చేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం (base) త్రికోణాకృతి (trigonal)తో గానీ, చతురస్రాకారం (tetragonal)లో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతి భుజం నుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (apex) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపు గోడ (side wall) సమద్విబాహు త్రిభుజాకృతి (isosceles triangle) లో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్న కొద్దీ అడ్డుకోత(transverse cross-section) వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువును కింద భాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ ఘన ఆకృతు (3-dimensional solid objects) లలో పిరమిడ్లు ప్రముఖమైనవి.
ఈజిప్టు పిరమిడ్‌ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువుగా సన్నని (పిరమిడ్‌ సైజుతో పోల్చుకొంటే) గుహలాంటిది ఉంటుంది. పిరమిడ్‌ పార్శ్వగోడల నుంచి ఒకటి రెండుచోట్ల ఈ గుహలోకి నాళికల్లాంటి దారులు(tunnels) ఉంటాయి. సాధారణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటాయి.

ఇదే చోటికి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్‌ పక్కగోడలకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి బయట, లోపల సమాన వాయుపీడనం (air pressure) ఉండేలా చేస్తాయి. గరిమనాభి (centre of gravity) నుంచి కిందివైపునకు నిలువుగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లినట్లయితే ఆ వస్తువు పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపునకు విడిగా వెళితేనే వస్తువు పడిపోతుందనీ మనం పాఠశాల స్థాయిలో నేర్చుకున్నాము. ఈ సూత్రం ఆధారంగా ఒక వస్తువు మీద మరో వస్తువును ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒకదానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడిపోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలనిగానీ, పుస్తకానికీ పుస్తకానికీ మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదు కదా! పటంలో చూపిన నిర్మాణాన్ని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌, జెడ్‌ అనే బండలతో నిర్మించితే అది పడిపోదు. ఈ బండల మధ్య సిమెంటు లేకున్నా అది స్థిరంగా ఉంటుంది. బి, సి, డి బండల మధ్య ఉన్న సందులో ఏవైనా బొమ్మల్ని, శవపేటికల్ని ఉంచగలము. కొన్ని వేలమంది కార్మికులు కొన్ని దశాబ్దాల పాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభమే! ఈ సందర్భంగా శ్రీశ్రీ రచించిన దేశచరిత్రలోని
తాజమహల్‌ నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోరు
అది మోసిన బోయీలెవ్వరు?...
తక్షశిలా, పాటలీపుత్రం,
హరప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంద్యల
మానవకథ వికాసమెట్టిది?'
ఈ చరణాలను ఇప్పుడు స్మరించుకోవడం సముచితం.

లూయీ పాశ్చర్‌

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  

మానవాళికి మేలు చేసిన అతి గొప్ప శాస్త్రజ్ఞుల్లో లూయీపాశ్చర్‌ మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ఫ్రాన్స్‌ దేశస్థుడు. 1882-95 మధ్య జీవించాడు. ఈయన పరిశోధనా ఫలితాల వల్ల ప్రతిరోజూ ప్రతిఒక్కరూ ఏదో రూపంలో లాభం పొందుతూనే ఉన్నారు. మొట్ట మొదట వ్యాక్సిన్‌ను తయారుచేసింది ఈయనే. రాబిస్‌, ఆంథ్రాక్స్‌, మశూచి, కలరా వంటి ప్రమాదకర జబ్బుల కారకాలను కనుగొని, వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. ఆధునిక జీవశాస్త్రానికి, బయోకెమిస్ట్రీకి పునాది ఏర్పరిచాడు. పులియటంలో గల శాస్త్రీయతను కనుగొని, వైన్‌, బీర్‌లాంటి పానీయాల తయారీకి మార్గం చూపాడు. ఈయన పరిశోధనలు విజ్ఞానశాస్త్రం పలుదిశల్లో విస్తరణకు తోడ్పడ్డాయి.
ఈయన కనిపెట్టిన సూక్ష్మజీవుల సిద్ధాంతం (జర్మ్‌ థియరీ) ఆధారంగా నేడు మనం పాలను సురక్షితంగా (పాశ్చరైజ్‌ చేసి) వాడుకుంటున్నాం. జర్మ్‌ థియరీ ద్వారా అంటురోగాలకు సంబంధించిన కారకాలను కనుగొని, నియంత్రించడానికి తోడ్ప డింది. శస్త్రచికిత్స ఇతరత్రా సమయాల్లో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఆధునిక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఈయన కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానమే తోడ్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన పరిశోధనల ఫలితాలను వ్యాక్సినేషన్‌, ఫర్మింటేషన్‌, పాశ్చరైజేషన్‌ (కాచి, చల్లార్చడం)తో నిత్యజీవితంలో మానవాళి పలు ప్రయోజనాలు పొందుతోంది.

వైరస్‌లు...

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  

ఇవి ఒకరకమైన సూక్ష్మజీవులు. స్వయంగా పునరుత్పత్తి కాలేవు. కానీ, ఏదైనా జీవకణంలోకి ప్రవేశించినపుడు పునరుత్పత్తి కాగలవు. వీటిలో పునరుత్పత్తికి అవసరమయ్యే పదార్థం (డిఎన్‌ఎ) చుట్టూ మాంసకృత్తుల పూత ఉంటుంది. జీవకణంలో ప్రవేశించి, కేంద్రకంలోకి వెళ్లిన తర్వాత ఇవి పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. కేంద్రకంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌ కాపీలు జీవకణం పగిలేంతవరకూ తయారవుతూనే ఉంటాయి. ఇలా జీవకణం పగిలి, విడుదలైన వైరస్‌లు ఇతర జీవకణాలను దాడి చేసి లోపలికి ప్రవేశించి, పునరుత్పత్తిని కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియతో వ్యాధి వస్తుంది. కణతులు లేదా గడ్డలు ఏర్పడతాయి. బ్యాక్టీరియాల మాదిరిగా వైరస్‌లను యాంటీబయాటిక్‌ మందులు చంపలేవు. కానీ, వైరస్‌ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి ఇటీవల టీకా మందులు వచ్చాయి. బలహీనంగా ఉన్న రోగ సూక్ష్మజీవుల నుండి టీకా మందులను తయారు చేస్తు న్నారు. అప్పుడు యాంటీబాడీలు శరీరంలోనే ఉత్పత్తవుతాయి. వైరస్‌ రోగ వ్యాప్తి నివా రణకు 'గార్డాసిల్‌, సర్వారిక్స్‌ టీకా మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని 'మానవ పాపిలోమా వైరస్‌ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌)' టీకాలు అంటారు. జలుబు చేసిన సమయంలో వైరస్‌లు దాడి చేసి వ్యాధిని కలిగించవచ్చు. జలుబు ఇబ్బందిని కలిగించినప్పటికీ ఇది తీవ్రమైన వ్యాధి కాదు. జలుబు ముట్టుకోవడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపించదు. జలుబుకు మందు లేదు. రెండొందలకన్నా ఎక్కువ వైరస్‌లు జలుబును కలిగిస్తున్నాయి. జలుబు వచ్చి నప్పుడు ఏ మందు తీసుకోకున్నా మన శరీరంలోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యి వారంరోజుల్లో తగ్గిపోతుంది.

టీకా మందులు

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
''చికిత్సకన్నా రోగనిరోధకం ఎంతో మేలు'' అనేది నానుడి. వ్యాధి వచ్చిన తర్వాత ఎంతో బాధపడి.. ఖరీదుతో చికిత్స చేయించుకునేదానికన్నా అతి కొద్ది ఖర్చుతో రోగ నిరోధకం కల్పించే 'టీకా'లను వేయించుకుంటే ఎంతో ఉత్తమమని ఈ నానుడి అర్థం. దాదాపు పిల్లలందరికీ ఇప్పుడు టీకాలను పుట్టినప్పటినుండే ఇస్తున్నాం. టీకాలంటే హాని చేయని రోగకారక సూక్ష్మజీవులను శరీరంలోకి చొప్పించి, (ఇంజెక్షన్లు, నోటిలో వేసే చుక్కలు, ఇతరత్రా) రోగ నిరోధక శక్తిని కలిగించడమే. అందువల్ల, ఈ టీకాల ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. ఇదే ఈనాటి 'విజ్ఞానవీచిక' లక్ష్యం.రోగ
నిరోధక వ్యవస్థ....
సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేసి, మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వ్యాధి వస్తుంది. ఈ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే ఈ జీవుల ఉపరితలానికి అతుక్కుని ఉన్న 'యాంటీజెన్స్‌' సహాయంతో రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధి కారక సూక్ష్మజీవులను గుర్తించగలదు. దీనికి ప్రతిస్పందనగా సూక్ష్మజీవుల యాంటీజెన్స్‌ శక్తిని నిర్వీర్యం చేయడానికి రోగనిరోధకశక్తిగల యాంటీబాడీలను ఉత్పత్తి చేసి, శరీరంలో వ్యాధి రాకుండా చేస్తుంది. ఏదైనా ఒక రోగానికి ఒకసారి యాంటీబాడీలు ఏర్పడ్డ తర్వాత, అదే రోగ క్రిములు శరీరంలోకి ప్రవేశించినపుడు యాంటీబాడీలు పునరుత్పత్తయ్యి యాంటీజెమ్‌లను నిర్వీర్యం చేసి, శరీరాన్ని రోగం నుండి కాపాడతాయి. ఇలాంటి రోగ నిరోధకశక్తిని 'చురుకైన రోగ నిరోధకశక్తి' (యాక్టివ్‌ ఇమ్యునైజేషన్‌) గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రోగ నిరోధకశక్తి దీర్ఘకాలం ఉంటుంది.
ఒకవేళ ఇప్పటికే రోగనిరోధకశక్తి గల జీవాల నుండి యాంటీబాడీలను సేకరించి, ఇతర జీవాలకు ఎక్కించినప్పుడు కలిగే రోగనిరోధకశక్తి తాత్కాలికంగా కొన్ని వారాలకే పరిమితమవుతుంది.
రోగ నిరోధకశక్తిని కల్పించడంలో వివిధ శరీరభాగాలు (బొమ్మలో వివరించినట్లు) ఇమిడి ఉన్నాయి. 'థైమస్‌' (గ్రంథి) రోగ నిరోధశక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. తెల్లరక్తకణాలు దాడి చేస్తున్న రోగ సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి యాంటీబాడీలను తయారుచేస్తాయి. ఎముకల్లో ఉన్న 'గుజ్జు' తెల్లరక్త కణాలను తయారుచేస్తుంది. 'లింఫ్‌ నోడులు' వ్యాధికారక బ్యాక్టీరియాలను తొలగించడానికి తోడ్పడటమేకాక, యాంటీబాడీలను, తెల్లరక్త కణాలను తయారుచేస్తాయి. 'స్ల్పీన్‌' గ్రంథి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. యాంటీబాడీలను కూడా తయారుచేస్తుంది.
క్యాన్సర్‌...
కొంత 'కణ సమూహం' ఏ అదుపూ లేకుండా మామూలుకన్నా ఎక్కువగా విభజనకు గురవు తుంది. దీనికి గల నిర్ధిష్ట కారణాలు ఇప్పటికీ చెప్పలేకపోతున్న ప్రజారోగ్యంలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఫలితంగా, చుట్టుపక్కల భాగాలపై దాడిచేస్తూ ఈ కణ సమూహం పెరుగుతుంది. ఇతర శరీర భాగాలకు కూడా లింఫ్‌ గ్రంథుల ద్వారా లేదా రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ మూడురకాలు నొప్పిలేని కణతులను (బినైన్‌ ట్యూమర్స్‌) గుర్తించవచ్చు. ఇదే క్యాన్సర్‌. ఒక్క లుకేమియాకు (రక్త కణాలకు వచ్చే క్యాన్సర్‌) తప్ప, మిగతా అన్నిరకాల క్యాన్సర్‌లలో ట్యూమర్లు (గడ్డలు) ఏర్పడతాయి. కేన్సర్‌ అధ్యయనం, నిర్ధారణ, చికిత్స, చదివే వైద్య భాగాన్ని 'అంకాలజీ' అని పిలుస్తారు.
అన్ని వయస్సుల వారికీ క్యాన్సర్‌ రావచ్చు. పొగాకు, అణుశక్తి, రసాయనాలు, అంటువ్యాధులను కలిగించే కొన్ని సూక్ష్మజీవులు క్యాన్సర్‌ వ్యాధిని కలిగించవచ్చు. వీటిని కార్సినోజెన్స్‌ (క్యాన్సర్‌ కారకాలు) అంటారు. 'డిఎన్‌ఎ' వృద్ధి, విభజన సమయంలో వచ్చే అనుకోని, అసాధారణ మార్పుల వల్ల, లేదా వారసత్వం వల్ల క్యాన్సర్‌ రావచ్చు. క్యాన్సర్‌ రోగ నిర్ధారణను బయాప్సీ (బతికి ఉన్న జీవకణాలను మైక్రోస్కోపుతో పరిశీలన) ద్వారా తెలుసుకుంటారు. మమోగ్రఫీతో రొమ్ము క్యాన్సర్‌ను, మలంలోని రక్తకణాలను, కొలోన్‌ ద్వారా కోలోన్‌ను పరీక్షించి క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. పురుష జననేంద్రియాలకూ ఈ క్యాన్సర్‌ రావచ్చు. పురుషుల్లో ఎక్కువగా ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ వస్తుంది. బయాప్సీ పరీక్ష ద్వారా దీనిని నిర్ధారించవచ్చు. ఎన్నోరకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్‌ వచ్చే శరీరభాగం మీద, వ్యాధిస్థాయి మీద క్యాన్సర్‌ వ్యాధి నయం కావడం ఆధారపడి ఉంటుంది.
క్యాన్సర్‌ వ్యాధిని ఇపుడు ఆధునిక రసాయన మందులతో, రేడియేషన్‌ పద్ధతి ద్వారా చికిత్స చేయవచ్చు. ఆపరేషన్‌ చేసి కూడా కణిత లేదా గడ్డ వచ్చిన భాగాన్ని పూర్తిగా తొలగించవచ్చు. కానీ ఇలా తొలగించే సమయంలో ఒక్క కణాన్ని వదిలిపెట్టకూడదు. పది బిలియన్‌ కణాలలో పది క్యాన్సర్‌ కణాలు మిగిలి ఉన్నప్పటికీ క్యాన్సర్‌ వ్యాధి పునరావృతం అవుతుంది.
క్యాన్సర్‌ వ్యాధుల్లో 30 శాతం పైగా జబ్బులను జాగ్రత్తలు తీసుకొని నివారించవచ్చు. ముఖ్యంగా, పొగాకు తీసుకోకుండా, ఊబకాయాన్ని నివారించి లేదా భౌతిక శ్రమశక్తి ద్వారా, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకొని, సెక్స్‌ విషయంలో వ్యక్తిగత నీతి, నియమాలు పాటిస్తూ, గాలి కాలుష్యాన్ని నివారించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు.
'మానవ (హ్యూమన్‌) పాపిల్లోమా వైరస్‌'తో స్త్రీ జననేంద్రియ క్యాన్సర్‌ను, మెదడు క్యాన్సర్‌ను (బ్రెయిన్‌ ప్యాపిల్లోమా వైరస్‌) అంటువ్యాధి కారకాల వల్ల నిరోధించవచ్చు. అంటువ్యాధి కారకాల వల్ల (వైరస్‌) వచ్చే క్యాన్సర్‌ను కూడా ఈ టీకా మందు నిరోధిస్తుంది. లివర్‌ క్యాన్సర్‌ను హెపటైటిస్‌ బి, సి-టీకాల ద్వారా నివారించవచ్చు. గార్డాసిల్‌ అనే మానవ పాపిల్లోమా వైరస్‌ టీకా మందుతో 70శాతం వరకూ వ్యాధిని తగ్గించవచ్చు. అయితే ఈ టీకా మందును జబ్బు రాక ముందే వేయాలి. ఒకసారి జబ్బు మొదలైన తర్వాత టీకా వేస్తే పనిచేయదు.
వివిధ వ్యాధులకు..
క్షయ వ్యాధి - బిసిజి; డిఫ్తీరియా, టెటనస్‌, కోరింత దగ్గు - డిటి డబ్ల్యుపి.
డిఫ్తీరియా, టెటనస్‌ - డిటి; టెటనస్‌-టిటి; హెపటైటిస్‌(కామెర్లు)-హెపటైటిస్‌ బి;
పొంగు, తట్టు (మీజిల్స్‌, రూబెల్లా) - ఎంఎంఆర్‌;
న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి), మెదడువాపు వ్యాధి - హెచ్‌ఐబి
పోలియో - ఐపివి; టెటనస్‌, డిఫ్తీరియా (గవదబిళ్లలు) - టిడి.
సర్వైకల్‌ క్యాన్సర్‌-హెచ్‌పివి(గార్డాసిల్‌,సర్వారిక్స్‌);న్యూమోనియా-పిసివి7,పిపివి23
- డా|| సిహెచ్‌. శారద, జన విజ్ఞాన వేదిక

ఆడవాళ్లకు ఎడమకన్ను, మగవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిదేనా? అందుకు విరుద్ధంగా జరిగితే దురదృష్టమా? వాస్తవం ఏమిటి?

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 31 Mar 2010, IST ఆడవాళ్లకు ఎడమకన్ను, మగవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిదని, అందుకు భిన్నంగా అదిరితే దురదృష్టమని అంటారు. నాకు కూడా అనుభవంలో అలాగే జరిగింది. ఇది వాస్తవమేనా? - బి. మల్లీశ్వరి, దాచేపల్లి, గుంటూరుజిల్లా. ఎడమ, కుడి, కళ్లు అదరడం, ఆడ, మగ ఇవన్నీ వాస్తవాలు. అదృష్టం, దురదృష్టం మిథ్యా పదాలు. వాటికి అర్థంపర్థం లేదు. కష్టం, లాభం, సామాజికపుటంశాలు. సంబంధం, సహేతుకం, అస్తిత్వంపరంగా వైవిధ్యం ఉండే పలు అంశాల్ని ఒకే గాటనగట్టి కలగాపులగంగా కలపడం అవివేకం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ధూమకేతువు (తోకచుక్క(comet)) కనిపిస్తే అది గ్రామానికో, దేశానికో అశుభ సూచకం అని నమ్మేరోజులు పాతకాలంలోవి. అయినా తోకచుక్కలకు, అర్థంపర్థంలేని అశుభం, శుభాలకు లంకె పెట్టే మూఢనమ్మకం నేటికీ ప్రజల్లో కొనసాగుతోంది. అలాగే ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరం (కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కి.మీ. వేగంతో వెళితే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని ఓ కాంతి సంవత్సరం, light year, అంటారు.) లో ఉన్న నక్షత్రరాశుల భంగిమకు, ఇక్కడ భూమ్మీద ఉన్న మనుషుల కష్టనష్టాలకు, ఉద్యోగసద్యోగాలకు, పెళ్లిళ్లు పెటాకులకు, విదేశీ ప్రయాణాలకు లింకుపెట్టే జ్యోతిష్యశ్శాస్త్రము ఓ కుహనా శాస్త్రమే అయినా ప్రజల్లో చాలామంది వేలం వెర్రిగా రాశిఫలాలను నమ్ముతున్నారు. ఎందరో మేధో సోమరులు ఆ మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఈ ఎడమకన్ను, కుడి కన్ను అదరడాలను ఆడామగా లైంగికత్వపు లక్షణాలతో కలగలిపి, వాస్తవదూరాలైనా అదృష్ట, దురదృష్ట మసాలాలను దట్టించి, ప్రజల కష్టాలనెత్తిన పులమడం. బాగా నిద్రపోయి, సరైన విశ్రాంతి తీసుకుంటే కన్ను అదరడాలు ఉండవు. పరీక్షల మూలానో, ఇంట్లో కార్యక్రమాల వల్లనో, మరేదైనా వృత్తిపరమైన వత్తిళ్ల వల్లనో అడపదడపా మనకు సరిపడా నిద్ర లభించకపోవచ్చు. అంటే కంటి రెప్పల్ని అదే పనిగా తెరిచే ఉంచాల్సిన అగత్యం లేదా కంటికి విశ్రాంతినివ్వకుండా కనురెప్పల్ని పదేపదే ఆర్పాల్సిన అవసరం పరిమితిని మించిన స్థితి తటస్థ పడిందన్నమాట. లేదా పరీక్షల కోసం అదేపనిగా చదువుతుండడం వల్లనో, కంప్యూటర్‌ మానిటర్‌ దగ్గర ఎక్కువసేపు పనిచేయడం వల్లనో, సన్నని అక్షరాలను కష్టపడి చదవవలసిన పరిస్థితి రావడంవల్లనో కంటికి శ్రమ అధికం కావచ్చును. అటువంటి పరిస్థితుల్లో కంటి కదలికలను కలిగించే కండరాలను నియంత్రించే మెదడు భాగాలు బాగా అలసిపోయి ఇబ్బందిపడతాయి. దీన్నే ఫ్యాటిగ్‌ (fatigue) అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి కండరాలను నియంత్రించే మెదడు యంత్రాంగం కొద్దిగా గతి తప్పి, లయ తప్పిన సంకేతాల (arrtythematic impulses) ను కండరాలకు అందిస్తుంది. ఆ సమయంలో కంటి కండరాలు స్వల్పంగా అదరడం సంభవిస్తుంది. ఇది కేవలం అరుదైన, అసాధారణమైన విషయం కాబట్టి, ఏదో ఒక కన్ను కండరాలు మాత్రమే కదుల్తాయి. ఒకోసారి ఈ పరిస్థితి కుడికన్నుకు రావచ్చును. మరోసారి ఎడమకన్నుకు కలగవచ్చును. అలసిపోవడం, మెదడు పనిచేసే విధానం, కంటిచూపు యంత్రాం గం, కంటి కదలికల యంత్రాంగం లైంగిక భేదాలకు సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఆడవారికైనా, మగవారికైనా కన్ను అదరడం మామూలే. ఒక్కోసారి నరాల బలహీనత ఉన్నవారికి, మెదడులో ఏదైనా సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ కన్ను అదరడం సాధారణం. కాబట్టి కన్ను అదరడం అన్న విషయం పూర్తిగా జీవ భౌతికచర్య (physiological action). కేవలం x, y క్రోమోజోముల ప్రభావంతో దేహంలో కలిగే లైంగిక అంశాలైన వక్షం, గడ్డం, మీసం, గొంతు ధ్వని, జననాంగాలు (genetalia), మొదలైనవాటిని మినహాయిస్తే మిగిలిన జీవప్రక్రియలన్నింటినీ (కన్ను అదరడంతో పాటు) స్త్రీపురుషులిరువురిలోనూ ఒకే విధమైన యంత్రాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా చూసినా కుడికన్ను మగవారికి, ఎడమకన్ను ఆడవారికి అదరడాన్ని లైంగికపుటంశంగా పరిగణించడం అశాస్త్రీయం. అసంబద్ధం. నిర్హేతుకం; కన్ను అదరడం ప్రమాదంలేని అవాంఛనీయమైన నాడీ ప్రక్రియ కాబట్టి లింగమేదైనా (ఆడైనా, మగైనా) అది కుడికన్నయినా, ఎడమకన్నయినా యంత్రాంగం ఒకటే. ఒకవేళ కన్ను అదరడం మంచిది కాదనుకుంటే అది ఏ కన్ను అదిరినా మంచిది కాదు. ఎడమ కన్ను అదిరితే ఆమోదయోగ్యంగానూ, కుడికన్ను అదిరితే ఆమోదరహితంగానూ లెక్కగట్టకూడదు. కన్ను అదరడం మంచిది కాదనుకుంటే ఆడవారికి అదిరినా, మగవారికి అదిరినా ఒకే విధమైన దృక్కోణంతో చూడాలి. శుభము, అశుభము, అదృష్టము, దురదృష్టము కేవలం కాల్పనిక మిథ్యార్థ (abstract) పదాలు. ఒకవేళ వాటిని మనం ఆనవాయితీగా కష్టంలేని పరిస్థితులను శుభం లేదా అదృష్టం అనీ, కష్టమైన పరిస్థితుల్ని అశుభం లేదా దురదృష్టము అని సర్దుకున్నా వాటికి సాపేక్షత (relative)ను ఆపాదించి చూస్తాము. కోట్లు దండుకొనే పెట్టుబడిదారుడికి ఓరోజు ఉన్నట్టుండి తాత్కాలికంగా ఓ లక్షరూపాయలు నష్టం కలిగితే అతనికి కష్టం వచ్చినట్లు, అతనికి అశుభం జరిగినట్లు వాళ్ల ఇంటిల్లిపాదీ భావిస్తారు. 'గరకునేలపై గురకలు వినరా' అంటూ ప్లాట్‌ఫారం మీద పడుకొని నిద్రించే పేదవాడి చితికిన బతుకుల్ని అదృష్టంగా చలామణీ చేసిన చాతుర్యం గల కవులకు ధనికుల ఇళ్లలో పరిమిత లాభాలే నష్టాలుగా కన్పిస్తాయి. 'కుడి కన్ను అదిరింది కుర్రోడా' అంటూ అశాస్త్రీయపుటంశాలను వల్లెవేస్తూ సామాజిక కర్తవ్యాలను విస్మరించే నేపథ్యరంగాల నేపథ్యంలో కళ్లు అదిరిపోయే కుళ్లు ఉంటుంది. ఇప్పటికీ భ్రూణ హత్యలు, గృహహింస, ఆర్థిక వివక్ష, విద్యా వివక్ష, పాలనా వివక్ష, సామాజిక వివక్ష, సాంస్కృతిక వివక్ష మొదలైన ఎన్నో వివక్షలకు లోనవుతున్న మహిళల కన్ను అదరడాల్లో కూడా మగవారితో సారూప్యత లేకుండా వివక్ష చూపుతున్నారు. ఆడవారికి కుడికన్ను అదిరితే అశుభమట. ఉత్తుత్తి అంశాల్లో కూడా ఆడవారికి తక్కువ హోదా (ఎడమవైపు) ఉంటేనే మంచిదట. ఎక్కువ హోదా (కుడివైపు) ఉన్నవన్నీ మగవారికే మంచివట. మీ కన్ను అదరడానికి, మీకు అనుభవంలోకి వచ్చిన శుభాఅశుభాలకు లంకె పెట్టడం పైవిధంగా చూస్తే అశాస్త్రీయం. నాకు జ్వరమొచ్చినప్పుడు రోడ్డు మీద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వ్యక్తి బస్సెక్కాడనుకుందాం. ఇక దానర్థం రోడ్డు మీద ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వాడు ఎక్కితే ఇంట్లో ఉన్న నాకు జ్వరమొచ్చిందని అనుకోవడం ఎంత అశాస్త్రీయమో మీ కన్ను అదరడానికీ మీకు కలిగిన శుభాఅశ భాలకు లింకు పెట్టడం కూడా అంతే అశాస్త్రీయం. ప్రజల కష్టనష్టాలకు కళ్లు అదరడానికి ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేదు. అలా ఉందనుకోడం పూర్తిగా అవాస్తవం.

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
ఆడవాళ్లకు ఎడమకన్ను, మగవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిదని, అందుకు భిన్నంగా అదిరితే దురదృష్టమని అంటారు. నాకు కూడా అనుభవంలో అలాగే జరిగింది. ఇది వాస్తవమేనా?
- బి. మల్లీశ్వరి, దాచేపల్లి, గుంటూరుజిల్లా.
ఎడమ, కుడి, కళ్లు అదరడం, ఆడ, మగ ఇవన్నీ వాస్తవాలు. అదృష్టం, దురదృష్టం మిథ్యా పదాలు. వాటికి అర్థంపర్థం లేదు. కష్టం, లాభం, సామాజికపుటంశాలు. సంబంధం, సహేతుకం, అస్తిత్వంపరంగా వైవిధ్యం ఉండే పలు అంశాల్ని ఒకే గాటనగట్టి కలగాపులగంగా కలపడం అవివేకం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ధూమకేతువు (తోకచుక్క(comet)) కనిపిస్తే అది గ్రామానికో, దేశానికో అశుభ సూచకం అని నమ్మేరోజులు పాతకాలంలోవి. అయినా తోకచుక్కలకు, అర్థంపర్థంలేని అశుభం, శుభాలకు లంకె పెట్టే మూఢనమ్మకం నేటికీ ప్రజల్లో కొనసాగుతోంది. అలాగే ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరం (కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కి.మీ. వేగంతో వెళితే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని ఓ కాంతి సంవత్సరం, light year, అంటారు.) లో ఉన్న నక్షత్రరాశుల భంగిమకు, ఇక్కడ భూమ్మీద ఉన్న మనుషుల కష్టనష్టాలకు, ఉద్యోగసద్యోగాలకు, పెళ్లిళ్లు పెటాకులకు, విదేశీ ప్రయాణాలకు లింకుపెట్టే జ్యోతిష్యశ్శాస్త్రము ఓ కుహనా శాస్త్రమే అయినా ప్రజల్లో చాలామంది వేలం వెర్రిగా రాశిఫలాలను నమ్ముతున్నారు. ఎందరో మేధో సోమరులు ఆ మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఈ ఎడమకన్ను, కుడి కన్ను అదరడాలను ఆడామగా లైంగికత్వపు లక్షణాలతో కలగలిపి, వాస్తవదూరాలైనా అదృష్ట, దురదృష్ట మసాలాలను దట్టించి, ప్రజల కష్టాలనెత్తిన పులమడం.

బాగా నిద్రపోయి, సరైన విశ్రాంతి తీసుకుంటే కన్ను అదరడాలు ఉండవు. పరీక్షల మూలానో, ఇంట్లో కార్యక్రమాల వల్లనో, మరేదైనా వృత్తిపరమైన వత్తిళ్ల వల్లనో అడపదడపా మనకు సరిపడా నిద్ర లభించకపోవచ్చు. అంటే కంటి రెప్పల్ని అదే పనిగా తెరిచే ఉంచాల్సిన అగత్యం లేదా కంటికి విశ్రాంతినివ్వకుండా కనురెప్పల్ని పదేపదే ఆర్పాల్సిన అవసరం పరిమితిని మించిన స్థితి తటస్థ పడిందన్నమాట. లేదా పరీక్షల కోసం అదేపనిగా చదువుతుండడం వల్లనో, కంప్యూటర్‌ మానిటర్‌ దగ్గర ఎక్కువసేపు పనిచేయడం వల్లనో, సన్నని అక్షరాలను కష్టపడి చదవవలసిన పరిస్థితి రావడంవల్లనో కంటికి శ్రమ అధికం కావచ్చును. అటువంటి పరిస్థితుల్లో కంటి కదలికలను కలిగించే కండరాలను నియంత్రించే మెదడు భాగాలు బాగా అలసిపోయి ఇబ్బందిపడతాయి. దీన్నే ఫ్యాటిగ్‌ (fatigue) అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి కండరాలను నియంత్రించే మెదడు యంత్రాంగం కొద్దిగా గతి తప్పి, లయ తప్పిన సంకేతాల (arrtythematic impulses) ను కండరాలకు అందిస్తుంది. ఆ సమయంలో కంటి కండరాలు స్వల్పంగా అదరడం సంభవిస్తుంది. ఇది కేవలం అరుదైన, అసాధారణమైన విషయం కాబట్టి, ఏదో ఒక కన్ను కండరాలు మాత్రమే కదుల్తాయి. ఒకోసారి ఈ పరిస్థితి కుడికన్నుకు రావచ్చును. మరోసారి ఎడమకన్నుకు కలగవచ్చును. అలసిపోవడం, మెదడు పనిచేసే విధానం, కంటిచూపు యంత్రాం గం, కంటి కదలికల యంత్రాంగం లైంగిక భేదాలకు సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఆడవారికైనా, మగవారికైనా కన్ను అదరడం మామూలే. ఒక్కోసారి నరాల బలహీనత ఉన్నవారికి, మెదడులో ఏదైనా సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ కన్ను అదరడం సాధారణం.

కాబట్టి కన్ను అదరడం అన్న విషయం పూర్తిగా జీవ భౌతికచర్య (physiological action). కేవలం x, y క్రోమోజోముల ప్రభావంతో దేహంలో కలిగే లైంగిక అంశాలైన వక్షం, గడ్డం, మీసం, గొంతు ధ్వని, జననాంగాలు (genetalia), మొదలైనవాటిని మినహాయిస్తే మిగిలిన జీవప్రక్రియలన్నింటినీ (కన్ను అదరడంతో పాటు) స్త్రీపురుషులిరువురిలోనూ ఒకే విధమైన యంత్రాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా చూసినా కుడికన్ను మగవారికి, ఎడమకన్ను ఆడవారికి అదరడాన్ని లైంగికపుటంశంగా పరిగణించడం అశాస్త్రీయం. అసంబద్ధం. నిర్హేతుకం; కన్ను అదరడం ప్రమాదంలేని అవాంఛనీయమైన నాడీ ప్రక్రియ కాబట్టి లింగమేదైనా (ఆడైనా, మగైనా) అది కుడికన్నయినా, ఎడమకన్నయినా యంత్రాంగం ఒకటే. ఒకవేళ కన్ను అదరడం మంచిది కాదనుకుంటే అది ఏ కన్ను అదిరినా మంచిది కాదు. ఎడమ కన్ను అదిరితే ఆమోదయోగ్యంగానూ, కుడికన్ను అదిరితే ఆమోదరహితంగానూ లెక్కగట్టకూడదు. కన్ను అదరడం మంచిది కాదనుకుంటే ఆడవారికి అదిరినా, మగవారికి అదిరినా ఒకే విధమైన దృక్కోణంతో చూడాలి. శుభము, అశుభము, అదృష్టము, దురదృష్టము కేవలం కాల్పనిక మిథ్యార్థ (abstract) పదాలు. ఒకవేళ వాటిని మనం ఆనవాయితీగా కష్టంలేని పరిస్థితులను శుభం లేదా అదృష్టం అనీ, కష్టమైన పరిస్థితుల్ని అశుభం లేదా దురదృష్టము అని సర్దుకున్నా వాటికి సాపేక్షత (relative)ను ఆపాదించి చూస్తాము. కోట్లు దండుకొనే పెట్టుబడిదారుడికి ఓరోజు ఉన్నట్టుండి తాత్కాలికంగా ఓ లక్షరూపాయలు నష్టం కలిగితే అతనికి కష్టం వచ్చినట్లు, అతనికి అశుభం జరిగినట్లు వాళ్ల ఇంటిల్లిపాదీ భావిస్తారు.

'గరకునేలపై గురకలు వినరా' అంటూ ప్లాట్‌ఫారం మీద పడుకొని నిద్రించే పేదవాడి చితికిన బతుకుల్ని అదృష్టంగా చలామణీ చేసిన చాతుర్యం గల కవులకు ధనికుల ఇళ్లలో పరిమిత లాభాలే నష్టాలుగా కన్పిస్తాయి. 'కుడి కన్ను అదిరింది కుర్రోడా' అంటూ అశాస్త్రీయపుటంశాలను వల్లెవేస్తూ సామాజిక కర్తవ్యాలను విస్మరించే నేపథ్యరంగాల నేపథ్యంలో కళ్లు అదిరిపోయే కుళ్లు ఉంటుంది. ఇప్పటికీ భ్రూణ హత్యలు, గృహహింస, ఆర్థిక వివక్ష, విద్యా వివక్ష, పాలనా వివక్ష, సామాజిక వివక్ష, సాంస్కృతిక వివక్ష మొదలైన ఎన్నో వివక్షలకు లోనవుతున్న మహిళల కన్ను అదరడాల్లో కూడా మగవారితో సారూప్యత లేకుండా వివక్ష చూపుతున్నారు. ఆడవారికి కుడికన్ను అదిరితే అశుభమట. ఉత్తుత్తి అంశాల్లో కూడా ఆడవారికి తక్కువ హోదా (ఎడమవైపు) ఉంటేనే మంచిదట. ఎక్కువ హోదా (కుడివైపు) ఉన్నవన్నీ మగవారికే మంచివట. మీ కన్ను అదరడానికి, మీకు అనుభవంలోకి వచ్చిన శుభాఅశుభాలకు లంకె పెట్టడం పైవిధంగా చూస్తే అశాస్త్రీయం. నాకు జ్వరమొచ్చినప్పుడు రోడ్డు మీద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వ్యక్తి బస్సెక్కాడనుకుందాం. ఇక దానర్థం రోడ్డు మీద ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వాడు ఎక్కితే ఇంట్లో ఉన్న నాకు జ్వరమొచ్చిందని అనుకోవడం ఎంత అశాస్త్రీయమో మీ కన్ను అదరడానికీ మీకు కలిగిన శుభాఅశ భాలకు లింకు పెట్టడం కూడా అంతే అశాస్త్రీయం. ప్రజల కష్టనష్టాలకు కళ్లు అదరడానికి ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేదు. అలా ఉందనుకోడం పూర్తిగా అవాస్తవం.